తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ప్ర‌మాదం సంభ‌వించింది. కాకినాడ సమీపంలోని స‌ర్ప‌వ‌రంలోని టైకీ ర‌సాయ‌న క‌ర్మాగారంలో గ్యాస్ లీకై బాయిలర్‌ పేలింది. బాయిలర్‌ పేలుడుతో పరిశ్రమలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతులను తాళ్లరేవు మండలం పటవలకు చెందిన కాకర్ల సుబ్రహ్మణ్యం (31), గొళ్లప్రోలు మండలానికి చెందిన తోటకూర వెంకటరమణ (37)గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిని మాధవపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్ర‌మాదంలో మంట‌లు అంటుకున్న క్ష‌త‌గాత్రులు అరుపులు పెడుతూ ప‌రుగులు పెట్టార‌ని స్థానికులు చెబుతున్నారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమ ప్రమాదం లో ఇద్దరు మరణించారు. 6గురికి గాయాలు అయ్యాయని నైట్రిక్ యాసిడ్ ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. సంఘటన పై పూర్తి దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాలుష్య నివారణ శాఖ, విపత్తుల శాఖ, పోలీస్ శాఖలను విచారణకు ఆదేశించామని మంత్రి అన్నారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మిలు చేరుకుని పరిశీలించారు. ఇదిలావుంటే.. ఈ ప‌రిశ్ర‌మ‌లో గ‌తంలో కూడా ప‌లుమార్లు ఇటువంటి ప్ర‌మాదాలు జ‌రిగాయి. త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.
సామ్రాట్

Next Story