పోలవరం నిర్వాసితులకు ఇళ్లు ఎందుకు నిర్మించలేదు.. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ

BJP slams Andhra CM for statement on Polavaram. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయం, పునరావాస ప్యాకేజీకి సంబంధించి కేంద్రం ఇంకా నిధులు విడుదల

By అంజి  Published on  28 July 2022 9:31 AM GMT
పోలవరం నిర్వాసితులకు ఇళ్లు ఎందుకు నిర్మించలేదు.. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయం, పునరావాస ప్యాకేజీకి సంబంధించి కేంద్రం ఇంకా నిధులు విడుదల చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బుధవారం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గురువారం తప్పుబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏం లేవని పార్లమెంట్‌లో కేంద్రం చెప్పినప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారో బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పాలన్నారు.

ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మించడంలో విఫలమైందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నిర్వాసితుల గ్రామాలను అభివృద్ధి చేస్తామని వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చిందని, ఇళ్లు కూడా కట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే ప్రాజెక్టు పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారని అన్నారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు శాపంగా మారాయని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధిని గాలికి లాగేస్తున్నారని ఆరోపించారు.

నిధుల కోసం తమ ప్రభుత్వం కేంద్రంతో పోరాడుతోందని ముఖ్యమంత్రి బుధవారం అన్నారు. ఢిల్లీకి లేఖలు రాశామని, ఉన్నతాధికారులతో జరిగిన ప్రతి సమావేశంలో చర్చిస్తున్నామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాలను సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరం ముంపు గ్రామాలలో ప్రతి కుటుంబానికి పరిహారం చెల్లించిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టులో నీటిని పూర్తి రిజర్వాయర్‌ లెవల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌)లో నిల్వ చేస్తామని రెండు జిల్లాల్లోని పోలవరం ముంపు గ్రామాలను సందర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యానికి మించి రూ. 20,000 కోట్లకు పైగా ఖర్చవుతున్నందున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కేంద్రం తప్పనిసరిగా అందించాలని సీఎం పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తుందని ప్రాజెక్టు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం రూ.2,900 కోట్లు రావాల్సి ఉందని సీఎం వెల్లడించారు. భద్రతా చర్యల దృష్ట్యా డ్యామ్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపేందుకు కేంద్ర జలసంఘం మొదట అంగీకరించనందున పోలవరంలో మొదటగా 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతామని చెప్పారు. మూడేళ్ల తర్వాతనే డ్యాం పూర్తిగా నిండుతుందని, అప్పటికి అందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని తెలిపారు.

Next Story