ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్‌లో 'భారత చైతన్య యువజన పార్టీ' (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.
By అంజి Published on 24 July 2023 1:02 AM GMTఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్‌లో 'భారత చైతన్య యువజన పార్టీ' (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, జనసేన మాజీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ బీసీవైని స్థాపించారు. గుంటూరు శివారులోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఆదివారం బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్, తదితర ప్రముఖ నేతల సమక్షంలో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పేరును ప్రకటించిన తర్వాత భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ స్థాపించి, కొత్త పార్టీ పేరును విధివిధానాలను ఆయన ప్రకటించారు.
రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతో బీసీవై ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్త రాజకీయ పాలన రావాలని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైఎస్సార్‌సీపీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకుంటున్నారని, వారిని చూస్తుంటే పురాణాల్లోని రాక్షులు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ పోటీ చేశారు. పెద్దిరామచంద్రారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా కొత్త రాజకీయ పార్టీనే స్థాపించిన రామచంద్ర యాదవ్.. రాజకీయాల్లో ఏ స్థాయిలో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.