బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వారికి అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీ చేసిన వారు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాగా.. ఎస్‌జీటీ పోస్టులకు మాత్రం అర్హత లేదంటూ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై జాతీయ ఉపాధ్యాయ మండలి స్పష్టత ఇవ్వనందున పాత నిబంధనలే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
1 నుంచి 5వ తరగతుల బోధనకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పించింది. బీఈడీ అర్హత ఉన్న వారు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్.. రెండు పోస్టులకూ అర్హులే. టెట్ పరీక్ష 150 మార్కులతో ఉంటుంది. మైనస్ మార్కులు ఉండవు. 1-5 తరగతులకు నిర్వహించే పేపర్-1లో ఇంగ్లీష్ భాషకు 30 మార్కులు పెట్టారు. ఓసీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ అర్హత జీవిత కాలం, టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. పేపర్‌కు దరఖాస్తు ఫీజు రూ. 750గా నిర్ణయించారు. దరఖాస్తు నింపడంలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు. మళ్లీ కొత్తగా ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందే.