అమరావతి: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. డీఎస్సీ అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్టు తెలిపారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 96 మంది ఎంపిక అయ్యారని తెలపారు.
అభ్యర్థులకు క్వాలిటీ భోజనం, ఆరోగ్య భద్రత, వసతితో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని, దానికి సంబంధించి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాల వారీగా బీసీ భవనాలను నిర్మిస్తామని చెప్పారు. అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందిస్తామని చెప్పారు. బీసీలకు ఆర్థిక భరోసా కలిగించేలా ఆదరణ 3.0 పథకం అమలుకు నిర్ణయించామన్నారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నామని తెలిపారు. దానికి తుది మెరుగులు దిద్దుతున్నామని చెప్పారు.