తృటిలో బాలకృష్ణకు తప్పిన ప్రమాదం
Balakrishna narrowly missed the accident.నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2023 8:50 AM ISTసినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా సుదీర్ఘ విరామం తరువాత బాలయ్య హిందూపురానికి వచ్చారు. ప్రజలతో మమేకం అయ్యారు. రోడ్ షోలను నిర్వహించడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను ముఖాముఖిగా కలుసుకున్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమంలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం అక్కడకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తుండగా వాహనం ముందుకు కదలడంతో బాలయ్య వెనక్కి తూలి కిందపడబోయారు. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయన్ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణలో కాళ్లు మొక్కుతా బాంచన్ అన్న విధంగా రాష్ట్రంలో పరిపాలన ఉందని దుయ్యబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడు తెచ్చారని, నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఉచిత పథకాల మోజులో పడి ప్రజలు మోసపోవద్దని సూచించారు. వాటి వెనుక పెంచుతున్న భారీ ధరల గురించి ఆలోచించాలన్నారు.
రివర్స్ టెండర్ పేరుతో పోలవరం ఆగిందని, యువత ఉపాధి లేక వలస పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నందునే తానంటే అందరికీ భయం అని చెప్పారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలను కోరారు.
నారా లోకేష్ యువత భవిష్యత్తు కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు బాలయ్య చెప్పారు. పాదయాత్రలో తాను కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.