బాలయ్య చేయి చేసుకోవడంపై స్పందించిన అభిమాని..!

Balaiah Fan Reacts On Incident. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేయి చేసుకోవడంపై స్పందించిన అభిమాని.

By Medi Samrat  Published on  6 March 2021 6:35 PM IST
Balaiah Fan Reacts On Incident

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫోటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా… అభిమాని వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య.. అభిమాని చెంప చెల్లుమనిపించారు. డిలీట్ చెయ్ రా అంటూ బాలయ్య ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. బాలయ్య కొడుతున్న వీడియోను అక్కడే ఉన్న కొందరు రికార్డు చేశారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సదరు యువకుడు స్పందించాడు. తన పేరు సోము అని... బాలయ్యకు తాను వీరాభిమానినని అతను చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య విరామం లేకుండా శ్రమిస్తున్నారని... ప్రచారంలో భాగంగా ఆయన తమ ఇంటికి వచ్చారని, అయితే తాను ఎవరో తెలియక, బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోసేశారని తెలిపాడు. బాలయ్య విషయంలో అభిమానులుగా తాము ఇలాంటి విషయాలను పట్టించుకోమని చెప్పాడు. ప్రచారంలో బాలయ్య ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని... కానీ ఆయన తనను టచ్ చేశారని సంతోషం వ్యక్తం చేశాడు. బాలయ్య తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపాడు. ప్రత్యర్థి పార్టీలు ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించాడు. జై బాలయ్య... జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశాడు. అతడి ఒంటిపై తెలుగుదేశం పార్టీ కండువా కూడా ఉంది.


Next Story