భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు

భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 14 Dec 2025 8:11 PM IST

Andrapradesh, Anakapalle District, Baba Atomic Research Centre, Nuclear Research, Atomic Energy, Small Modular Reactors

భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు

భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో అణు శాస్త్ర పరిశోధనలు, ఆధునిక రియాక్టర్ టెక్నాలజీలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో సుమారు 3,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త క్యాంపస్‌ను నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమిని సేకరించారు. దీనికి అదనంగా అవసరమైన 148.15 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించేందుకు బార్క్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ ఇటీవల సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ప్రణాళికలో ఈ అటవీ భూమి అత్యంత కీలకం కావడంతో, ఈ అనుమతితో పనులకు తొలి అడ్డంకి తొలగిపోయింది.

దేశీయంగా అణు ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అణు పరిశోధనలు, రియాక్టర్ల అభివృద్ధి, నూతన ఇంధన సాంకేతికతలలో బార్క్ విస్తరిస్తున్న పాత్రకు ఈ కొత్త క్యాంపస్ ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story