ఆనంద‌య్య‌కు షాక్‌.. ఆయుష్‌శాఖ నోటీసులు

Ayush Department notices to Nellore Anandayya.రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌రోసారి పెర‌గుతున్నాయి. క‌రోనా కొత్త వేరియంట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 11:16 AM GMT
ఆనంద‌య్య‌కు షాక్‌.. ఆయుష్‌శాఖ నోటీసులు

రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌రోసారి పెర‌గుతున్నాయి. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలో క‌రోనాతో పాటు ఒమిక్రాన్‌ను కూడా త‌న ఆయుర్వేద మందుతో న‌యం చేస్తాన‌ని నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆనంద‌య్య‌పై ఆయుష్ శాఖ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. అనుమ‌తి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు ఆనంద‌య్య‌కు నోటీసులు జారీ చేసింది.

ముందస్తు అనుమతి లేకుండా మందు ఎలా తయారు చేస్తార‌ని..? ఏ ప్రమాణాలకు లోబడి తయారు చేశార‌ని ప్ర‌శ్నించింది. మందులో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మందుకు సంబంధించి పూర్తి స‌మాచారం ఇవ్వాల‌ని చెప్పింది. ఇక ఆనందయ్య ఇచ్చే సమాధానం చూసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలు పరిశీలిస్తామన్నారు. కాగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని ఆయుష్ శాఖ మరోసారి స్పష్టం చేసింది. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను తగ్గిస్తానంటూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని ఆయుష్ శాఖ తెలిపింది.

ఇక రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే నేడు కేసులు భారీగా న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,954 పరీక్షలు నిర్వహించగా.. 3,205 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న నిన్న ఎటువంటి మ‌ర‌ణం సంభ‌వించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 14,505 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 281 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,63,255కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్‌ కేసులున్నాయి.

Next Story