టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ సమీకృత టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. విశాఖ సమీపంలోని భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని గతంలో చంద్రబాబు నిర్ణయించినా అధికారం కోల్పోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది.
తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. విమానయాన శాఖ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తన వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తానని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను రామ్మోహన్‌నాయుడు షేర్ చేశారు.
శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాల్లో పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియర్ కూడా. కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు.