ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో భూఆక్రమణ దారులు దారుణానికి పాల్పడ్డారు. భూ వివాదం కారణంగా తల్లీకూతుళ్లపై మట్టి పోసి పూడ్చేందుకు ప్రయత్నించారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఇది చూసి.. తల్లీకూతుళ్లను రక్షించారు. తమ సొమ్ముతో కొనుకున్న స్థలాన్ని కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూమి విషయంలో వాగ్వాదం జరగడంతో.. కొట్ర దాలమ్మ, ఆమె కూతురు మజ్జిపై ప్రత్యర్థులు దాడికి దిగారు. తల్లి కుమార్తెను బంధించి ట్రాక్టర్‌తో మట్టి పోసి పూడ్చేందుకు యత్నించారు.
అక్కడే ఉన్న స్థానికులు ఇది గమనించి వారిని కాపాడారు. కంకరను పారతో తొలగించి తల్లీకూతుళ్లను మట్టి నుంచి బయటకు తీశారు. తమ భూమిని కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు. వారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అధికారులు కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం తల్లి కూతుళ్లు దాలమ్మ, సావిత్రి పోరాటం చేస్తున్నారు. తల్లీకూతుళ్లపై జరిగిన ఈ హత్యాయత్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.