Atchutapuram: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు
అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 22 Aug 2024 3:30 AM GMTAtchutapuram: పేలుడులో 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 106 (1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.
మరో వైపు ఈ ఘటనకు గల కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్ - బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారిందని, ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగిందని పేర్కొంది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయని తెలిపింది.
పేలుడు జరిగిన ఎసెన్షియా కంపెనీని అచ్యుతాపురంలో 2019లో ఏర్పాటు చేశారు. ఇది అమెరికాకు చెందిన సంస్థ. యూఎస్‌లోని కనెక్టికట్, ఇండియాలోని హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్వహిస్తోంది. అచ్యుతాపురంలోని సెజ్‌లో కమర్షియల్ తయారీ కేంద్రాన్ని నడుపుతోంది. ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడి సరుకులను సరఫరా చేస్తోంది.