మందుబాబులతో కలిసి చిందులేశాడో ఏఎస్సై. ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించారు కొందరు. ఆపై సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది. విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టిలో పడటంతో ఆ ఏఎస్సైని వీఆర్‌కు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముండ్లమూరు మండలం శంకరాపురంలో కొన్ని రోజుల కిందట రాజకీయ వివాదం తలెత్తింది. ఓ రాజకీయ పార్టీలోని రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
రాజకీయ వివాదం కొట్టుకునే స్థాయికి చేరడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. అయితే విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి నెట్టింట పోస్టు చేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ సైతం పంపినట్లు తెలిసింది.