పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు
పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
By అంజి Published on 18 March 2025 8:33 AM IST
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చొరవకు అనుగుణంగా, తెలుగుదేశం పార్టీ (TDP) పార్లమెంటు సభ్యులు గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను అనుసరించి, పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్ సాహూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు.
లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకారం.. ఈ స్టాల్స్‌ను పార్లమెంటు భవనంలోని నిర్ణీత ప్రదేశాలలో సంగం ప్రాంతం, నలంద లైబ్రరీ సమీపంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది పార్లమెంటు సభ్యులకు సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో దీనిని ప్రస్తావించడంతో అరకు కాఫీ జాతీయ దృష్టిని ఆకర్షించింది. కాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం పొందిన తర్వాత, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ (జిసిసి) సోమవారం నుండి పార్లమెంట్ క్యాంటీన్‌లోని రెండు ప్రదేశాలలో తాత్కాలిక అరకు కాఫీ స్టాళ్లు పనిచేస్తాయని ప్రకటించింది.