ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్‌పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By - అంజి |
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్‌పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఇటీవల యూరోపియన్ మార్కెట్‌కు రొయ్యల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తాజగా అమెరికా కూడా సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ఎగుమతులకు మరింత ఊపు వచ్చింది. దీంతో రొయ్యల ధరలు పెరిగి ఆక్వా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
భారత్ నుంచి ఎగుమతి అయ్యే సీ ఫుడ్‌లో రొయ్యలే ప్రధానంగా ఉండటంతో ఈ నిర్ణయం ఆక్వా రంగానికి సంజీవనిగా మారనుంది. ఇది రొయ్యలు సాగుచేస్తున్న రైతుల్లో ఆనందం తెచ్చి పెట్టింది. యూరోపియన్ మార్కెట్‌కు మన దేశ రొయ్యలు ఎగుమతి అయ్యేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదరడంతో.. యూరోపియన్ మార్కెట్‌కు రొయ్యల ఎగుమతి ప్రారంభమైంది. ఈ క్రమంలో రొయ్యల ధర పెరగడంతో ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అటు యూఎస్‌తో ట్రేడ్ డీల్ ముగించినందుకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ డీల్ చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి వంటిదన్నారు. 'టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం 2 ప్రజాస్వామ్య దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచ వృద్ధిని కాంక్షించే దార్శనిక చర్య ఇది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ తన పాత్రను సుస్థిరం చేసుకుంటోంది. ఏపీకి, యువత, రైతులకు అపార అవకాశాలు కల్పిస్తుంది' అని ఎక్స్‌లో పేర్కొన్నారు.