ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ప్రమాదకరం. ఆర్టీసీ బస్సులు సురక్షితం అంటూ ప్రకటనలు చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును ఇష్టారీతిన నడిపాడు. ప్రయాణీకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. తాము సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామో లేదోనని వారు కంగారు పడ్డారు. డ్రైవర్‌ను మందలించారు. దీంతో ఆ డ్రైవర్ బస్సును అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలివేసి వెళ్లిపోయాడు. ఎంతకీ ఆ డ్రైవర్ రాకపోవడంతో ప్రయాణీకులు ఉన్నతాధికారులు, పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. కడప డిపోకు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కడప నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. బస్సును ర్యాష్‌గా డ్రైవ్ చేస్తుండడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. డ్రైవర్‌ను మందలించారు. దీంతో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపైనే వదిలేసిన డ్రైవర్ వెళ్లిపోయాడు. ఎంత సేపటికీ అతడు రాకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే స్పందించి మరో డ్రైవర్‌ను బస్సు దగ్గరకు పంపించి ప్రయాణీకులను గమ్యస్తానానికి చేర్చారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ బస్సును డ్రైవర్ మధ్యలో వదిలి వెళ్లిపోవడం నిజమేనని తెలిపారు. అయితే..అతడు ఇలా ఎందుకు చేశాడనేది తెలుసుకుంటామని చెప్పారు. కాగా.. ఇంత వరకు ఆ బస్సు డ్రైవర్ రాలేదని వారు అన్నారు.