ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు అకాల వర్షాలు కురవనున్నాయి. నేడు కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్రవడగాలులు(11), మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలో అల్లూరి జిల్లా సహా అక్కడక్కడా వడగండ్ల వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8°C, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4°C, 54 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7మిమీ,ప్రకాశం కనిగిరిలో 43మిమీ,అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.