అమరావతి: రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని కీలక యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను నియమించడంతో పాలన, విద్యా కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం, గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వెంకటసత్యనారాయణరాజు సమంతపుడిని, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి తాతా నర్సింగరావును వీసీలుగా నియమించారు. అదేవిధంగా, కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి బి. జయరామిరెడ్డి, విజయనగరంలోని జేఎన్‌టీయూకు వి. వెంకటసుబ్బారావు, కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి రాజశేఖర్ బెల్లంకొండను వీసీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ఈ కీలక విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, పరిశోధనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నియమితులైన వీసీలు తమ అనుభవంతో ఆయా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి దోహదపడతారని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నియామకాలతో వర్సిటీల పాలన, విద్యా కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు.