ప్రతి శుక్రవారం.. మహిళా గౌరవ దినోత్సవం: వాసిరెడ్డి పద్మ
ఇకపై రాష్ట్రంలో ప్రతి శుక్రవారాన్ని.. మహిళా గౌరవ దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
By అంజి Published on 5 July 2023 4:39 PM IST
ప్రతి శుక్రవారం.. మహిళా గౌరవ దినోత్సవం: వాసిరెడ్డి పద్మ
విజయవాడ: ఇకపై రాష్ట్రంలో ప్రతి శుక్రవారాన్ని.. మహిళా గౌరవ దినోత్సవంగా నిర్వహిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం నాడు నగరంలోని ఓ హోటల్‌లో సోషల్ మీడియాలో మహిళలపై దాడి అంశంపై మహిళా కమిషన్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దుర్వినియోగంపై ఆమె ప్రసంగించారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.
కొందరు సీఎం ఫ్యామిలీ, మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా బరితెగించి పోస్టులు పెడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే మహిళలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల పట్ల ఇలాగే ప్రవర్తిస్తే.. త్వరలోనే రోడ్డుపై తన్నులు తినే రోజులు వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలు కూడా సంయమనం పాటించాలని చెప్పారు.
అవసరమైతే చట్టాలు, శిక్షలు మర్చాలన్నారు. మహిళలను మళ్లీ ఇళ్లకు పరిమితం చేయాలని చూస్తున్నారని, మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్న వారిని వదిలిపెట్టమన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఈ సెమినార్ నిర్వహించామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. సెమినార్‌లో పోలీసు అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఏపీ ఎన్జీవోల సంఘం, ఏపీ జేఏసీ అమరావతి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వక్తలు సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.