పొంచివున్న తుఫాను ముప్పు.. మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ
By అంజి Published on 3 May 2023 3:45 AM GMTపొంచివున్న తుఫాను ముప్పు.. మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఏపీ: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో శ్రీశైలం మల్లన్న సమీపంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీట మునిగాయి. ఇక పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ గ్లోబల్ వెదర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (జీఎఫ్ఎస్), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా వేసిన తర్వాత ఐఎండీ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఒకవేళ ఈ తుఫాను అధికారికంగా ధృవీకరించబడితే, ఎస్కాప్ సభ్య దేశాలు అవలంబించిన నామకరణ వ్యవస్థ ప్రకారం ఈ తుఫానుకు 'మోచా' అని నామకరణం చేస్తారు.