ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత ఉన్నా, వడగాల్పుల ప్రభావం ఉండనుంది.
రానున్న రోజుల్లో ఆరు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 21 వరకు, మహారాష్ట్రలో, జార్ఖండ్‌లో రాబోయే మూడు రోజులు హీట్‌వేవ్ పరిస్థితులు ఉండవచ్చు. ఏప్రిల్ 19 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో వేడి గాలులు వీస్తాయని IMD అంచనా వేసింది.