అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఇందులో 11,103 కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు.
తెలంగాణలోనే మాత్రమే కాదు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సైతం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తున్నారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి ఏపీలోని విశాఖలో ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలుపుతూ తమకు ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. వయో పరిమితిని సైతం 47 సంవత్సరాలకు పెంచాలని.. విరమణ వయస్సు 60 యేళ్ళకు తగ్గించాలని డిమాండ్ చేశారు.