సీపీఎస్‌పై పోరుబాటకు సై
AP trade unions are gearing up for the fight against CPS. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఈ మూడు పదాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. పాదయాత్రలో సీపీఎస్‌ను
By సునీల్ Published on 26 Aug 2022 10:05 AM GMT* ఏకమవుతున్న ఉద్యోగ సంఘాలు
* మిలియన్ మార్చ్, సీఎం నివాస ముట్టడికి నిర్ణయం
* ఫలితాలనివ్వని ప్రభుత్వ చర్చలు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఈ మూడు పదాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. పాదయాత్రలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. మ్యానిఫెస్టోలోనూ అదే అంశాన్ని పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడేళ్లుగా రద్దు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు.. ఇక పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
వేలకోట్ల భారం
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్)ను పునరుద్ధరించడం తేలికేం కాదు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీలో ఓపీఎస్ తేవడం వల్ల వేల కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీపీఎస్ రద్దుపై పూర్తి అవగాహన లేకుండా హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు.
కమిటీలపై కమిటీలు
2004లో అమలులోకి వచ్చిన సీపీఎస్‌పై అప్పటి నుంచి ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు వేస్తూనే వచ్చాయి. సీపీఎస్ రద్దుపై టీడీపీ ప్రభుత్వం టక్కర్ కమిటీ వేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ అధికారుల కమిటీ వేసింది. ఆ కమిటీల సిఫార్సులు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం రద్దు చేసేందుకు సుముఖంగా లేదు. పెన్షన్ విధానాన్ని మారిస్తే లక్షల మంది ఉద్యోగులకు వర్తింపజేయాలి. అందువల్ల కోట్ల రూపాయల భారం పడుతుందనేది ప్రభుత్వ వాదన. అందుకే సీపీఎస్, ఓపీఎస్ కాకుండా గ్యారంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) పేరుతో మధ్యేమార్గాన్ని ప్రభుత్వం తెచ్చింది. కానీ జీపీఎస్ ప్రతిపాదనకు కనీసం ఐదు శాతం ఉద్యోగుల మద్దతు కూడా రాలేదు.
ఏకతాటిపైకి ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం శాఖలవారీగా, యూనియన్ల వారీగా పోరాటాలు చేస్తుంటారు. సీపీఎస్ అనేది అందరికీ సంబంధించిన అంశం కావడంతో ఒకే మాట మీదకు వస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగుల్లో సగం మంది వరకు ఉపాధ్యాయులే ఉండటంతో ఆ సంఘాలన్నీ ఉద్యమబాట పడుతున్నాయి. సీపీఎస్ రద్దు కోసమే ఏర్పాటైన ఏపీసీపీఎస్‌యూఎస్, ఏపీసీపీఎస్ఈఏ సంఘాలతో సహా అన్ని ఉద్యోగ సంఘాలు రద్దు కోసం చేసే పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
1న మిలియన్ మార్చ్
2004లో సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజును చీకటి రోజుగా సీపీఎస్ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పదులసార్లు చర్చలు జరిపినా ఉద్యోగుల ఆమోదం పొందలేకపోయింది. అన్ని అంశాలపై రాజీ పడినా సీపీఎస్‌పై మాత్రం తగ్గేదేలే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. రాబోయే సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అదే రోజున ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చాయి.
పాఠాలు నేర్పిన పీఆర్సీ ఉద్యమం
ఉద్యోగ సంఘాల ఉద్యమబాట నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి. గతంలో పీఆర్సీపై పోరు సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మంది నిరసన ర్యాలీ తీశారు. విజయవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి వెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారని తెలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రకరకాల వేషాలు వేసుకుని ప్రయాణించారు. కొంతమంది ముందుగానే చేరుకుని తెలిసిన వారిళ్లలో బస చేశారు. ఆ ర్యాలీకి పది వేల మంది కూడా రారని పోలీసులు భావించగా దాదాపు 70 వేల మంది వరకు వచ్చారు. ఆ సమయంలో నేర్చుకున్న పాఠాలతో మిలియన్ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. విద్యాశాఖ కూడా ఆ రోజు ఉపాధ్యాయులకు సెలవు లేదంటూ సర్క్యులర్లు జారీ చేసింది. తమ ఉద్యమంతోనైనా ప్రభుత్వం దిగి వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.