ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
AP State cabinet meeting has been Adjourned March 7th.మార్చి 3న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
By తోట వంశీ కుమార్
మార్చి 3న జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద ఖర్మ దృష్ట్యా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7న మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా మార్చి 7న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రి మండలి సమావేశం జరగనుంది.
సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతి రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చిన సీఎం.. అనుమతి తీసుకున్నారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ ను ఆహ్వానించారు.
మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. 11న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు.ఈ సారి బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. వ్యవసాయం, పాడి పరిశ్రమపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది.