ఈ-గవర్నెన్స్‌ను అమలు చేయడంలో.. నాల్గవ స్థానంలో ఏపీ

AP stands at fourth place in implementing e-governance for 2021-22. 2021-22 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఈ -గవర్నెన్స్ అమలులో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు

By అంజి  Published on  10 Oct 2022 11:33 AM IST
ఈ-గవర్నెన్స్‌ను అమలు చేయడంలో.. నాల్గవ స్థానంలో ఏపీ

2021-22 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఈ -గవర్నెన్స్ అమలులో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, 109.27 కోట్లతో ఉత్తరప్రదేశ్, 84.23 కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను చట్టబద్ధమైన, చట్టబద్ధత లేని సేవలు, వ్యాపార పౌర సేవలు, సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలు వంటి ఆరు విభాగాలుగా వర్గీకరించింది. ఆంధ్రప్రదేశ్ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు రిపోర్ట్‌ వెల్లడించింది. 4.16 కోట్ల చట్టబద్ధమైన, చట్టబద్ధత లేని లావాదేవీలు, 10.76 కోట్ల యుటిలిటీ బిల్లు చెల్లింపుల లావాదేవీలు, 4.13 కోట్ల సమాచార సేవల లావాదేవీలు, 33.83 కోట్ల సామాజిక ప్రయోజన లావాదేవీలు, 23,000 వ్యాపార పౌర సేవల లావాదేవీలు జరిగాయని రిపోర్ట్‌ పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యక్రమాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తూ ప్రత్యేక డిజిటల్ కార్యదర్శులను నియమించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు జరిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అన్ని సేవలను అందిస్తోంది. నవరత్నాల్లో పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరిస్తూ ఈ-గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించిందని నివేదిక వెల్లడించింది.

Next Story