ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన..రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీల్లో నేటితో ఒక కీలక అధ్యాయం ముగియనుంది.

By -  Knakam Karthik
Published on : 2 April 2026 7:07 AM IST

Andrapradesh,  PanchayatElections, SpecialOfficersRule, GramPanchayat, SarpanchTenure, VillageAdministration

ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన..రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీల్లో నేటితో ఒక కీలక అధ్యాయం ముగియనుంది. 2021లో ఎన్నికైన సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలం నేటి అర్ధరాత్రికి ముగియనుండటంతో, రేపటి నుండి పల్లెల్లో ప్రత్యేకాధికారుల (Special Officers) పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో పరిపాలన ఆగిపోకుండా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూసేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం సుమారు 20 రోజుల క్రితమే ముందస్తు కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDOs), తహసీల్దార్లు లేదా ఇతర గెజిటెడ్ అధికారులకు గ్రామ పంచాయతీల బాధ్యతలను అప్పగించనున్నారు. దీనివల్ల రేపటి నుండి నిధుల విడుదల, చెక్కులపై సంతకం చేసే అధికారం మరియు గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి పనుల పర్యవేక్షణ అంతా ఈ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది.

గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడం వల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహణలో ప్రస్తుతానికి సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా పనిచేసిన నీలం సాహ్ని పదవీకాలం మొన్నటితో ముగియడంతో ఆ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలన్నా లేదా నోటిఫికేషన్ విడుదల చేయాలన్నా కొత్త ఎస్‌ఈసీ నియామకం తప్పనిసరి. ప్రభుత్వం త్వరలోనే కొత్త కమిషనర్‌ను నియమించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు మరియు ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్రంలోని పల్లెల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు బదులుగా అధికారుల పర్యవేక్షణలోనే పనులు సాగనున్నాయి.

Next Story