అమరావతి: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు బోధనలో అంతరం ఏర్పడకుండా ఈ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10,000 ఇస్తారు.
మండల స్థాయిలో ఉన్న ఖాళీలపై ఎంఈవో ప్రకటన చేయనుండగా.. ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు ఎంఈవో ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్ (75 శాతం), ప్రొఫెషనల్ (25 శాతం) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీలోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. కాగా ఈనెల 8 నుంచి విధుల్లోకి వచ్చే ఇన్‌స్ట్రక్టర్లు మే 7వ తేదీ వరకు కొనసాగుతారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా తొలగింపబడతారని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.