ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
By Knakam Karthik
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తాం. బడ్జెట్ లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం. ఎన్నికలకు ముందుకు బాబు సూపర్ – 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారు. భారతదేశంలో రీప్లేస్ మెంట్ రేట్ లో తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీలో ఉంది. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
కాగా సూపర్‌సిక్స్ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15వేల రూపాయలను కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనంతో పాటు, మొత్తం పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.31,805 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా.. వచ్చే అకడమిక్ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15,000 చొప్పున తల్లికి వందన పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు.