నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌.. అందుబాటులోకి పోర్టల్‌

అమరావతి: ఇసుక బుకింగ్‌ కోసం రూపొందించిన ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ నేడు అందుబాటులోకి రానుంది.

By అంజి  Published on  20 Sept 2024 6:29 AM IST
AP Sand Management System portal, CM Nara Chandrababu , APnews, Sand

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌.. అందుబాటులోకి పోర్టల్‌

అమరావతి: ఇసుక బుకింగ్‌ కోసం రూపొందించిన ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ నేడు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో అమలుపరుస్తున్న ఉచిత ఇసుక విధానానికి అనుబంధంగా ఏపీ శాండ్ మేనేజిమెంట్ సిస్టం పోర్టల్ ను నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇసుకను పొందగలిగే విధంగా పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. ఎవరైనా, ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఇసుక బుకింగ్‌ చేసుకోగలిగే విధంగా పోర్టల్‌ విధానాన్ని నవీకరించాలన్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. ఉచిత ఇసుక హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

నూతన ఇసుక పోర్టల్‌ ద్వారా ఇసుక సరఫరాపై వివిధ దశల్లో అనుక్షణం నిఘా ఉంటుందని చెప్పారు. అధికారులు మొదలుకొని రవాణాదారుల వరకు ఎవరూ తప్పులు చేయలేని విధంగా పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4599కు లేదా ఈ-మెయిల్‌ dmgapsan-dcomplaints@yahoo.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

Next Story