కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ముస్తాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ వివాదం జరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు ఎదురు పడ్డారు. ఆ సమయంలోనే అభ్యర్ధుల సమక్షంలో కార్యకర్తలు తలపడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నాయకులను అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
అటు బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య గవినివారిపాలెం పోలింగ్ బూత్‌లను సందర్శించడానికి వచ్చిన సమయంలో గొడవ జరిగింది. కొండయ్య కారుపై దాడి చేశారు. ప్రత్యర్థులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జెట్టిపాలెంలో కొంతమంది దుండగులు ఈవీఎంలను పగలగొట్టారు. భయాందోళనకు గురైన ఎన్నికల సిబ్బంది బూత్ నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో 216, 205, 206, 207 నంబర్ గల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిచిపోయింది. మరోవైపు తుమ్మరకోటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలింగ్ ఆగిపోయింది.