నేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
By అంజి Published on 1 May 2024 4:13 PM ISTనేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాను భూములు ఇచ్చేవాడినే కానీ.. లాక్కునేవాడిని కాదు అని అన్నారు. ''మీ భూములపై మీకు స్వరహక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. బ్రిటిషన్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వేలు లేకపోవడంతో ప్రజలు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడేవారు. ఆ పరిస్థితిని మార్చేందుకే ల్యాండ్ టైటిలంగ్ యాక్ట్ తెచ్చాం'' అని సీఎం జగన్ తెలిపారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. తాను ఎలాంటివాడినో రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని అన్నారు. భూములపై సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉద్దేశ్యమని తెలిపారు. భూములపై సమగ్ర సర్వే చేయించి.. వారికే హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మే 13న మరోసారి కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే యుద్ధం ఇది అన్నారు.
విలువలకు, విశ్వసనీయతకు ఓటేయడానికి మీరంతా (ప్రజలు)సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమేనన్నారు. ఎన్నికల్లో మీరు వేసే ఓటే పేదల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. వృద్ధులకు ఇంటివద్దే పెన్షన్ ఇవ్వడం విప్లవం అవునా?కాదా? అని ప్రజలను సీఎం జగన్ అడిగారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, ఉన్నత చదువుల కోసం విద్యాదీవెన, వసతి దీవెన,పిల్లలను బడులకు పంపే తల్లులకు అమ్మఒడి పథకం.. అక్కా చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నావడ్డీ.. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్, మహిళల రక్షన కోసం దిశా యాప్ తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు.