పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి కీలక విషయాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు.
By అంజి
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వెలుగులోకి కీలక విషయాలు
అమరావతి: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరగా దారిలో వైన్స్‌కు వెళ్లారని, మూడో చోట్ల యాక్సిడెంట్ జరిగిందన్నారు. పలు చోట్ల సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామని వివరించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని, పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామన్నారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారని తెలిపారు. సోషల్ మీడియాలో మాట్లాడినవారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదని, సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనన్నారు. ప్రవీణ్.. దారిలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారని, దారిలో ప్రవీణ్ కు మూడుసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయన్నారు.
''జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారు. కీసర వద్ద ప్రవీణ్ కు సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. గుంటుపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారు. బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయింది. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ ను ఆటోడ్రైవర్ చూశారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారు. కండిషన్ బాగాలేదు, వెళ్లవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారు. ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు.
మద్యం షాపునకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయింది. కొంతమూరు పైవంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారు. ప్రమాదస్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ కు, పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి.. కంకర రాళ్లు ఉన్నాయి. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్ లో ఉందని చెప్పారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది'' అని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.