నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉద్రిక్తత.. భారీగా ఏపీ పోలీసుల మోహరింపు
నాగార్జునసాగర్‌కు చెందిన 13 గేట్లను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు కుడి కాలువకు నీరు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
By అంజి Published on 30 Nov 2023 11:45 AM ISTనాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉద్రిక్తత.. భారీగా ఏపీ పోలీసుల మోహరింపు
నాగార్జునసాగర్‌కు చెందిన 13 గేట్లను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు కుడి కాలువకు నీరు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే వారికి తెలంగాణ అధికారులు షాక్ ఇచ్చారు. మోటార్లకు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. దీంతో నీటి విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఏపీ అధికారులు కరెంట్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కుడికాల్వకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
నాగార్జున సాగర్ డ్యామ్ అంశాన్ని పోలీసులు చూసుకుంటారని, ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలెవరూ నిబంధనలు అతిక్రమించ వద్దని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ సూచించారు. అయితే ఈ అంశంపై నేతల స్పందిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణకే పూర్తి హక్కులు ఉన్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అనవసరంగా వివాదాలు రాజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. అటు ఇది బీఆర్‌ఎస్ కృత్రిమంగా సృష్టించిన అంశమన్న ఆరోపణలను గుత్తా తోసిపుచ్చారు. ఈ అంశంతో రాజకీయం చేసే ఉద్దేశం, అవసరం తమకు లేదన్నారు.
నాగార్జున సాగర్ వివాదంద బీఆర్‌ఎస్ ప్రభుత్వ స్ట్రాటజీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 'సాగర్ డ్యామ్ ఎక్కడికీ పోదు.. గేట్లు ఎక్కడికి పోవు. తొమ్మిదిన్నరేళ్లు లేని గొడవ ఇప్పుడెందుకు వచ్చింది. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ వివాదాన్ని పరిష్కరిస్తాం. కేసీఆర్‌కు ఎప్పుడూ ఇలాంటి వాటి మీద దృష్టి లేదు. ఆయనకు తన కుటుంబం మీదే ప్రేమ' అని రేవంత్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. నాగార్జున సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసేందుకు పోలీసులు ఇరిగేషన్ అధికారులతో కలిసి వచ్చినట్లు చెప్తున్నారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహణలో ఉంది. ఎస్పీఎఫ్ బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే, ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్‌పైకి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిని ఎస్పీఎఫ్ బలగాలు వ్యతిరేకించాయి.
డ్యామ్‌కి చెందిన 26 గేట్లలో 13 ఏపీకి, మరో 13 తెలంగాణ పరిధిలోకి వస్తాయి. పదమూడో నంబర్ గేటు వద్దకు ఏపీ పోలీసులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఏపీ పోలీసులు కంచె వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, దీనిపై ఏపీ పోలీసులు కానీ, అధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.