ఏపీ పంచాయతీ ఎన్నికలపై.. హైకోర్టు కీలక తీర్పు
AP Panchayat election .. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By సుభాష్ Published on 8 Dec 2020 12:16 PM ISTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆపలేమని మరోసారి స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని, దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నవంబర్ చివరి వారంలో ప్రకటన విడుదల చేశారు. అయితే.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్దంగా లేదని.. వెంటనే పంచాయతీ ఎన్నికలను ప్రక్రియను నిలిపివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం తరుపున పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిబ్రవరిలో పంచాయతీ నిర్వహణ సాధ్యం కాదని.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్‌లో ఆక్షేపించారు. రాష్ట్రంలో కరోనా వల్ల 6వేల మందికి పైగా మృతి చెందారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.