ఏపీలో కొత్తగా 26 జిల్లాలు

AP New Districts. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంత‌మైంది. ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ చెప్పినట్టుగా..

By Medi Samrat  Published on  10 Jan 2021 6:01 AM GMT
AP New Districts

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంత‌మైంది. ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ చెప్పినట్టుగా.. లోక్‌సభ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుంది. ఈ మేర‌కు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చింది. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.


పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు-1 పరిధిలోకి తీసుకొస్తారు. అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అరకు-2 పరిధిలోకి తేవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో అరకు-1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు, హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు.

అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, కడప, నంద్యాల, రాజంపేట, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హిందూపురం జిల్లాలు ఏర్పాటు అవుతాయి. కొత్త జిల్లాల్లో భాగంగా ఇప్పటి వరకు పిలుస్తున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పేర్లు మాయం కానున్నాయి.

కొత్త జిల్లాలు ఏర్పడుతుండడంతో రాష్ట్రంలోని 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతమున్న వాటిలో మూడింటి రద్దుకు ప్రతిపాదించింది. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 డివిజన్లు ఉండాలని కమిటీ సూచించింది. బాపట్ల జిల్లాలో కొత్తగా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటులో విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, భౌగోళిక కొనసాగింపు, మౌలిక సౌకర్యాలు, ఆర్థిక పురోగతి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
Next Story
Share it