ఏపీలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి 10 పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై.. 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.
ఇదిలావుంటే.. మున్సిపల్ ఎన్నికలకు గతేడాది మార్చి 11న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ వాయిదాపడింది. దీంతో తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగతున్నాయి. వెంట వెంటనే ఎన్నికలు జరుగుతుండటంతో.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వెడెక్కింది.