ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో అక్కడ కూడా పోలింగ్ జరుగుతుంది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు, డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
తూర్పు నియోజకవర్గం పటమట లంక కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖపట్నం మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.