AP MLC Elections: వైసీపీ ఖాతాలో ఆరు, టీడీపీకి ఒకటి
ఏపీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ
By అంజి Published on 23 March 2023 9:00 PM ISTAP MLC Elections: వైసీపీ ఖాతాలో ఆరు, టీడీపీకి ఒకటి
ఏపీ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఊహించని విధంగా విజయం సాధించారు. గెలుపుకు అవసరమైన 23 ఓట్లు టీడీపీకి లభించాయి. అయితే టీడీపీ ఉన్న సంఖ్య బలం 19 మంది ఎమ్మెల్యేలే. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతోనే టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించారని చెబుతున్నారు. ఇప్పటికే పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గెల్చుకున్న టీడీపీ.. ఇప్పుడు మరోసారి తన సత్తా చాటినట్లైంది. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ మొత్తం ఏడు స్ధానాలకు అభ్యర్ధులను బరిలో దింపింది.
19 మంది సభ్యుల మద్దతు కలిగిన టీడీపీ సైతం తమ అభ్యర్ధిగా అనురాధను బరిలో దింపి గెలిచింది. ఎన్నికల్లో ఓటు వేసిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఐదుగురు వైసీపీ అభ్యర్థులు, ఒక టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థులు సూర్యానారాయణ రాజు, పోతుల సునీత, బొమ్మి ఇశ్రాయేలు, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్ విజయం సాధించారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లలో కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ చెరో 21 ఓట్లు సాధించారు. వీరిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో జయమంగళ వెంకట రమణ గెలిచారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..
1. మర్రి రాజశేఖర్ (వైఎస్ఆర్ సీపీ)
2. పోతుల సునీత (వైఎస్ఆర్ సీపీ)
3. జయమంగళ వెంకట రమణ (వైఎస్ఆర్ సీపీ)
4. ఏసు రత్నం (వైఎస్ఆర్ సీపీ)
5. సూర్యనారాయణ రాజు (వైఎస్ఆర్ సీపీ)
6. ఇజ్రాయిల్ (వైఎస్ఆర్ సీపీ)
7. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ గెలుపు