మంత్రుల కమిటీ సమావేశం.. ఏపీలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంటారా..?

AP Ministers Committee Meet. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

By Medi Samrat  Published on  27 April 2021 6:48 PM IST
AP ministers committee meet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనా కట్టడి చేయడానికి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కీలక సూచనలు చేస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని తెలిపారు.

కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే కరోనాను కట్టడి చేసే యోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆళ్ల నాని.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్తాయి లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదని తెలిపారు. ఒకవేళ అలాంటి మార్గదర్శకాలు వస్తే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. లాక్ డౌన్ నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది.


Next Story