ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో 13 సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. భూ కేటాయింపులు రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేశ్ సమావేశానికి హాజరయ్యారు.
భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. "గతంలో 131 మందికి భూములు కేటాయించాం. వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించాం. 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధిని మార్చాం" అని మంత్రి తెలిపారు.
అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని ఆసక్తి ఉన్న ప్రతి కంపెనీకి భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే గతంలో కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ప్రారంభించని కారణంగా 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నామన్నారు. అమరావతికి లక్షల కోట్లు అవసరం లేదని, సీఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు విక్రయించి రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.