అమరావతి: రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి బాంబ్ పేల్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితం అని మంత్రి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని వైసీపీ సభ్యుడు పీవీ సూర్యనారాయణరాజు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని అన్నారు. అయితే ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
మహిళలకు జిల్లాల్లోనే ఉచిత ప్రయాణం అని, ఈ విషయాన్ని ఎన్నికల సమయంలోనే చెప్పామని తెలిపారు. బడ్జెట్‌పై ఎమ్మెల్సీలు కళ్యాణి, చంద్రశేఖర్ రెడ్డి, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, వంకా రవీంద్ర తమ అభిప్రాయాలను తెలిపారు. మండలి ప్రారంభం అయిన వెంటనే సామాజిక పింఛన్ల మంజూరుపై చర్చకు వైసీపీ ఎమ్మెల్సీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఛైర్మన్ మోషేనురాజు దాన్ని తిరస్కరించారు. అటు తెలంగాణ, కర్ణాటకలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే.