ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే.. వైసీపీ మాత్రం తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కల్తీ లిక్కర్‌పై కూటమి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నకిలీ లిక్కర్ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలోని నాయకులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రూ.వేల కోట్లు దండుకున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారను. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు పరిపాలన చూసి రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తరలి వస్తున్నాయని చెప్పారు.
వైసీపీ నేతలు.. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. నకిలీ లిక్కర్‌పై వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సెటైర్ వేశారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని అన్నారు. కల్తీ లిక్కర్‌ను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు. స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్ రిపోర్టుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి పార్థసారథి తెలిపారు.