'మైక్రోసాఫ్ట్ సహకారం కావాలి'.. సత్య నాదెళ్లను కోరిన మంత్రి నారా లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 29 Oct 2024 10:52 AM IST
'మైక్రోసాఫ్ట్ సహకారం కావాలి'.. సత్య నాదెళ్లను కోరిన మంత్రి నారా లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నారని సత్య నాదెళ్లకు తెలిపారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు.
"క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉంది. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి పనిచేద్దాం" అని ప్రతిపాదించినట్టు తెలిపారు.
ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాలని కోరానని, ఏపీలో అగ్రిటెక్‌కు ఎఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవోకు చెప్పినట్టు మంత్రి నారా లోకేష్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతోపాటు మంచి ఎకో సిస్టం ఉందని వివరించానని తెలిపారు.
''క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరాను. అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేసేందుకు ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది అని చెప్పాను. ఏపిలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారు'' అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.