గుడ్ న్యూస్.. మూడు లక్షల గృహాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.

By Knakam Karthik  Published on  13 March 2025 7:09 AM IST
Andrapradesh, Government Of Andhrapradesh, Ap Welfare Schemes, PMAY

గుడ్ న్యూస్.. మూడు లక్షల గృహాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రానికి మొత్తం 18.04 లక్షల గృహాలు మంజూరైతే గత ప్రభుత్వం కేవలం 5.87 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేసి, 12.20 లక్షల గృహ నిర్మాణాలను అసంపూర్తిగా విడిచిపెట్టేసిందని పేర్కొన్నారు. అదే విధంగా 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం ఎస్సీ గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 అదనపు ఆర్థిక సాయం అందించేదని, కానీ గత ప్రభుత్వం ఈ అదనపు సాయాన్ని రద్దు చేయడమే గాక యూనిట్ విలువను రూ.1.80 లక్షలకు తగ్గించేసిందన్నారు. ఈ మొత్తంలో కేవలం రూ.30,000 మాత్రమే గత ప్రభుత్వం అందజేయడం జరిగిందని తెలిపారు. గృహ నిర్మాణానికి కేటాయించిన నిధులను కూడా గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో వేరే పధకాలకు మళ్లించడంతో రాష్ట్రంలో గృహ నిర్మాణ పధకాలు పూర్తిగా కుంటు పడ్డాయని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.

సాయం పునరుద్ధరణ..

అయితే గతంలో తమ పభుత్వం అందించిన అదనపు సాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఈ నెల 10 వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు మరియు పివిటీజీలకు రూ.1.00 లక్షల అదనపు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0 మరియు పి.ఎం.జన్మన్ పథకాల క్రింద ఇప్పటికే గృహాలను మంజూరు చేయబడిన దాదాపు 5,98,710 లబ్దిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. వీరిలో 1,57,383 మంది ఎస్సీలు, 45,766 మంది ఎస్టీలు, 3,73,204 మంది బీసీలు మరియు 22,357 PVTG లబ్దిదారులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా గృహ లబ్దిదారులకు అదనపు సాయం అందజేయడం వల్ల ప్రభుత్వంపై దాదాపు రూ.3,219.75 కోట్ల అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ పేదవాళ్లకు సాయం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.

పీఎంఏవై పొడిగింపు సఫలీకృతం..

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి 1.25 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను మార్చి 2026 లోగా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు వీటిలో 5.00 లక్షల గృహాలను ఈ ఏడాది జూన్ లోపు పూర్తి చేయనున్నామని, మిగిలిన గృహాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయనున్నామన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం అమలు గడువు ముగిసిపోవడంతో, ఆ గడువును పొడించాలని తమ ప్రభుత్వం చేసిన కృషి సఫలీకృతం అయిందని, వచ్చే ఏడాది మార్చి వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించిందని ఆయన తెలిపారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్దిదారులకు ఆయన సూచించారు.

Next Story