ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
By Knakam Karthik
ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు.. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం పోరాటం చేస్తున్నారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారధి ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహార శైలి వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. ప్రజల సమస్యలను వదిలి తనకు ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం చేయడం దారుణం.. అని మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. ప్రజల సమస్యలపై బాధ్యత లేఊని వైనాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు. గతంలో బీజేపీ నుంచి ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా సభలో బలంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడేవారు అని.. జగన్ సహా వైసీపీ నేతలకు బాధ్యత లేదు..అని మండిపడ్డారు.
స్వార్థపూరితంగా వ్యవహరించడం కారణంగానే జగన్ సహా వైసీపీని ప్రజలు ఛీకొట్టారని మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. వ్యక్తి కోసం పార్టీ పెట్టారని అర్థం చేసుకుని వైసీపీ నేతలూ ఛీకొట్టే పరిస్థితి వస్తుందని ఆరోపించారు. కూటమి, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. గత ఐదేళ్లలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతిపాలు చేసింది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుని పోయేలా చేసిందని ఆరోపించారు. అప్పుల ఊబిలో ఇరుక్కున్న ప్రభుత్వాన్ని బయటకు తీసుకు వచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. పది సూత్రాలతో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని స్వర్ణాంధ్ర సాధనకు రాష్ట్ర ప్రభుత్వం పునాది వేసిందని వెల్లడించారు. నిరుద్యోగులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా.. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి తల్లికి వందనం.. రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.