ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి, వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో డిస్టిలరీల నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు..అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
ఎక్సైజ్ వ్యవస్థపై జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బ తిన్నాయి. జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారినపడ్డారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం. అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహించి మద్యం షాపులు కేటాయించాం. నవోదయ 2.0 ద్వారా సారా రహిత రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తున్నాం..అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.