రంగులపై చూపించిన శ్రద్ధ, రైతులను ఆదుకోవడంలో లేదు...జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్
"జగన్ ప్రభుత్వంలో అరటి రైతులను ఆదుకోవడానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు..అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Knakam Karthik
రంగులపై చూపించిన శ్రద్ధ, రైతులను ఆదుకోవడంలో లేదు...జగన్‌పై ఏపీ మంత్రి ఫైర్
"జగన్ ప్రభుత్వంలో అరటి రైతులను ఆదుకోవడానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు..అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకూ అండగా నిలబడుతుంది..అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు కొన్ని చోట్ల అకాల వర్షాలతో నష్టం జరిగింది. గత ఐదు సంవత్సరాలలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఒక్క ఏడాది కూడా వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అకాల వర్షాలతో నష్టపోయి రోడ్డున పడ్డా.. పరిహారం అందించకుండా జగన్ రెడ్డి విలాసాల కోసం వేలకోట్లు వృథా చేశారు..అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35 వేలు మేర ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయడంతో పాటు మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టార్‌కు రూ.75 వేలు అందజేయడం జరుగుతుంది. మొత్తం రూ.1.10 లక్షల వరకు సాయం అందుతుంది. ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయి. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఎన్యూమరేషన్ ప్రక్రియ మొదలవుతుంది..అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
పులివెందులలో అరటి రైతులు ఉన్నారని జగన్ రెడ్డికి ఇప్పుడు గుర్తుకు వచ్చారా? గిట్టుబాటు ధర లేక గత ఐదేళ్లలో రైతులు నష్టపోయినా జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ హయాంలో అరటి రైతులను ఆదుకోవడానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రూ.3 వేల కోట్లతో వైసీపీ రంగులు వేయడంపై చూపించిన శ్రద్ధలో ఒక వంతు కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చూపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెక్టార్‌కు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అందించిన విషయం జగన్ రెడ్డికి కనిపించలేదా?..అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.