సాగర్‌పై దండయాత్ర చేయలేదు.. హక్కును కాపాడుకున్నాం: మంత్రి అంబటి
నాగార్జున సాగర్ విషయంలో కొందరు రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
By అంజి Published on 1 Dec 2023 1:15 PM IST
సాగర్‌పై దండయాత్ర చేయలేదు.. హక్కును కాపాడుకున్నాం: మంత్రి అంబటి
నాగార్జున సాగర్ విషయంలో కొందరు రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడారు. నాగార్జున సాగర్ సగం గేట్లు ఏపీ భూభాగంలోనే ఉన్నాయని అన్నారు. అక్కడికి తాము వెళ్లాలన్నా తెలంగాణ పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందని, అక్కడికి వెళ్లి తమ వాటా నీళ్లు వదులుకోవడం తమ హక్కు, అందుకే అక్కడికి వెళ్లామన్నారు. తాము దండయాత్ర చేయలేదని, తమ రాష్ట్ర హక్కును కాపాడుకున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ఉద్రిక్తత విషయంలో ఏపీ పోలీసులపై నమోదైన కేసుపై కూడా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
'మా రాష్ట్ర పోలీసులపై తెలంగాణ విజయపురి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చెల్లదు. పోలీసులు మా భూభాగంలోనే ఉన్నారు. మేము వారితో ఘర్షణ పడలేదు. మా హక్కు సాధించుకున్నాం. ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరూ గమనించాలి' అని మంత్రి అంబటి తెలిపారు. నాగార్జునసాగర్ డ్యామ్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దని కొన్ని మీడియా సంస్థలకు మంత్రి అంబటి హితవు పలికారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయన్నారు.