ఏపీలో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకూ కొనసాగింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. అధికార వైసీపీ 5,998 స్థానాలను గెలుచుకుంది. 826 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఇక జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 502, టీడీపీ 6, జనసేన 2, సీపీఎం, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.
ఇదిలావుంటే.. ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 9672 స్ధానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 7219 స్ధానాలకు ఎన్నికలు జరగాయి. ఇక రాష్ట్రంలో మొత్తం జడ్పీటీసీ 660 స్థానాలుండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరిగింది.