ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమావేశమయ్యారు. విజయవాడలోని సమగ్ర శిక్షణ రాష్ట్ర కార్యాలయం నుంచి అధికారులతో మాట్లాడిన మంత్రి సురేష్.. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. అన్ని జిల్లాల్లో అధికారులు కోవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని ఆదేశించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలని.. ఏ రాష్ట్రంలో కూడా పరీక్షలు రద్దు కాలేదని.. కొన్నిచోట్ల నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల వాయిదా వేశారని అన్నారు. అయితే.. కొన్ని రాజకీయ పార్టీలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇప్పటికే పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు తెలియజేశారు.
5 నుంచి 23 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని సెంటర్ లపై నిఘా ఉంచి ప్రతి రోజు సమీక్షిస్తామని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.